భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం ఆదివారం కొరియా ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో నాలుగో సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ దక్కించుకున్న ఈ జోడి ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తోంది. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకోవడం విశేషం.
ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ డబుల్స్ నెంబర్‌వన్ జోడి ఫజర్ అల్‌పయాన్- ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. కొరియా ఓపెన్ కంటే ముందు ఇదే సీజన్‌లో స్విజ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, ఆసియన్ చాంపియన్స్ గెలిచిన ఈ జోడి ఖాతాలో 87,211 ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో భాగంగా వీరిద్దరూ ఈ సీజన్‌లో ఆడిన 10 ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో కూడా ఓటమిపాలవ్వలేదు. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సాత్విక్-చిరాగ్ జోడి జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీపై కన్నేసింది. మంగళవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది.
ఇక తెలుగుతేజం పీవీ సింధు వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారుతూ వస్తోంది. కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సింధు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. గాయంతో దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పరుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 10వ స్థానాన్ని నిలుపుకోగా.. కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ ఒక స్థానం కోల్పోయి 13వ స్థానంలో ఉన్నాడు. ఇక కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు.
చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ దూరం
Comments
Please login to add a commentAdd a comment