Doubles badminton
-
వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం ఆదివారం కొరియా ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగో సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ దక్కించుకున్న ఈ జోడి ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తోంది. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకోవడం విశేషం. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ డబుల్స్ నెంబర్‌వన్ జోడి ఫజర్ అల్‌పయాన్- ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. కొరియా ఓపెన్ కంటే ముందు ఇదే సీజన్లో స్విజ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, ఆసియన్ చాంపియన్స్ గెలిచిన ఈ జోడి ఖాతాలో 87,211 ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో భాగంగా వీరిద్దరూ ఈ సీజన్లో ఆడిన 10 ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో కూడా ఓటమిపాలవ్వలేదు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సాత్విక్-చిరాగ్ జోడి జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీపై కన్నేసింది. మంగళవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక తెలుగుతేజం పీవీ సింధు వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారుతూ వస్తోంది. కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. గాయంతో దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పరుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానాన్ని నిలుపుకోగా.. కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ ఒక స్థానం కోల్పోయి 13వ స్థానంలో ఉన్నాడు. ఇక కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ దూరం ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు! -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
Tokyo Olympics: మ్యాచ్ గెలిచినా ఇంటిదారి పట్టిన భారత జోడీ
టోక్యో: భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జోడీ మంగళవారం జరిగిన గ్రూప్ ఎ పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించారు. బ్రిటన్‌కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-17, 21-19 తేడాతో గెలుపొందారు. అయితే గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్టర్స్‌కు మాత్రం వీళ్లు క్వాలిఫై కాలేకపోయారు. మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్, వాంగ్ చిలిన్ జోడీ ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో జోడీపై గెలవడం సాత్విక్, చిరాగ్ అవకాశాలను దెబ్బతీసింది. కాగా, సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో జోడీ 21-13, 21-12 తేడాతో సాత్విక్, చిరాగ్‌ల జోడీపై గెలుపొందిన విషయం తెలిసిందే. -
నాకు గుర్తింపు దక్కడం లేదు!
‘డబుల్స్’ అంటే అలుసెందుకు? గుత్తా జ్వాల వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది. 30 ఏళ్ల ఈ హైదరాబాదీ ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కాంస్య పతకంతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పటికీ... కేవలం ‘డబుల్స్’ ముద్రతో అంతగా లైమ్‌లైట్‌లోకి రాలేకపోయింది. దీనిపై బాహటంగానే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన జ్వాల డబుల్స్ అంటే చిన్న చూపెందుకని మరోసారి ప్రశ్నించింది. దశాబ్దానికిపైగా నిలకడైన కెరీర్‌ను కొనసాగిస్తున్న జ్వాల దీనిపై మాట్లాడుతూ ‘నేను సాధించిన పతకాలకు నజరానాలు అడగడం లేదు. నగదు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. నేనూ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్‌ననే గుర్తింపు కావాలి. ‘సింగిల్స్’లాగే నా విజయాలను గౌరవిస్తే చాలు’ అని చెప్పింది. ఒలింపిక్స్ (లండన్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను మేటి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించానంది. అయినా... ఇంకా తానేం నిరూపించుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇలాంటి ఘనవిజయాలున్న తన స్థానాన్ని భర్తీచేసే క్రీడాకారిణి ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బాయ్‌కు చురకలంటించింది. ‘ఎవరి మద్దతు లేకుండానే అనుకున్నవి సాధించాను. నా పతకాలను అసోసియేషన్ (బాయ్) గుర్తించకపోగా... లేని సాకుతో ఏకంగా వేటుకూ యత్నించారు. అయినా అన్నీ భరించాను. న్యాయపోరాటం చేశాను. ఏబీసీలో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను’ అని తెలిపింది. తన భాగస్వామి అశ్విని పొనప్ప కూడా రాణిస్తున్నా... ‘డబుల్స్’ నీడనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరునెలలుగా నరకం అనుభవించానని తిరిగి ఏబీసీ పతకంతో విమర్శలకు ప్రదర్శనతోనే బదులిచ్చానని జ్వాల పేర్కొంది. మానసిక స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని, తాజా పతకంతో తమ జోడి స్థైర్యం పెరిగిందని, ఇదే జోరుతో ముందడుగు వేస్తామని చెప్పింది.