అభిమానం అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా ప్రయాణం చేసేలా చేస్తోంది. మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న కుతూహలం ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్‌లో టికెట్ దొరక్కపోతే.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా సరే వెర్రి అభిమానం అంత దూరం మనల్ని తీసుకెళ్తుంది. అలా చూసినప్పుడే మనకు ఆత్మసంతృప్తి.
క్రికెట్‌లో కూడా అలాంటి పిచ్చి అభిమానం ఉన్న ఫ్యాన్స్ కొందరుంటారు. ఆ కోవకు చెందిన వాడే మిస్టర్ మాట్. తస్మానియాకు చెందిన మాట్‌కు క్రికెట్ అన్నా.. ఆస్ట్రేలియా జట్టు అన్నా విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే అతన్ని తస్మానియా నుంచి వయా చైనా, సైప్రస్‌లు మీదుగా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చింది. 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసిన మ్యాట్ లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ మ్యాట్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టి20ల కంటే ఎక్కువగా యాషెస్‌ను ఆదరిస్తారు. బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగడంతో లార్డ్స్ టెస్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి.
అయితే 58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు.లార్డ్స్ కు చేరుకున్నాకా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ''నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి.''అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు.
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీని మ్యాట్ ఒక టికెట్ ఉంటే ఇప్పించండి అంటూ బతిమాలుకున్నాడు. దీంతో బర్మీ ఆర్మీలోని ఒక వ్యక్తి అతని అభిమానానికి కరిగిపోయి తన టికెట్‌ను అతనికి ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజున మూడో సెషన్‌లో అతను గ్రౌండ్‌లోకి చేరుకొని మ్యాచ్ వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రితం రోజు స్కోరుకు మరో 76 పరుగులు జోడించి 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో సెషన్‌లో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. బెన్ డకెట్ 86, ఓలీ పోప్ 39 పరుగులతో ఆడతున్నారు. ఇంగ్లండ్ ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment