England tour of Australia, 2022: పాకిస్తాన్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ముందు కంగారూలతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానంటూ అభిమానులకు శుభవార్త అందించాడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్.
కాగా పిక్కల్లో గాయం కారణంగా బట్లర్ పాక్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జట్టుతో కలిసి పాకిస్తాన్ వెళ్లినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సారథ్య బాధ్యతలు చేపట్టిన మొయిన్ అలీ 4-3తో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు.
ఈ క్రమంలో వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ.. ‘‘నేను వందకు వంద శాతం ఫిట్‌గా ఉన్నా. పాకిస్తాన్‌లో రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ గురించి చెబుతూ.. ‘‘అతడు ఇంకా పూర్తి(మడిమ గాయం)గా కోలుకోలేదు. వరల్డ్‌కప్ ఆరంభ సమయానికి అందుబాటులోకి వస్తాడనుకుంటున్నా’’ అంటూ బట్లర్ అప్‌డేట్ ఇచ్చాడు. అయితే, అతడు మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా అక్టోబరు 9, 12, 14 తేదీల్లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. అక్టోబరు 16న ఐసీసీ టోర్నీ ఆరంభం కానుండగా.. 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో ఇంగ్లండ్ మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై..
Comments
Please login to add a commentAdd a comment