AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారితో సహా కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు.
లబూషేన్ ఎందుకు లైటర్ అడుతున్నాడో తెలియక ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారు కూడా కాసేపు తలలు గీకున్నారు. కామెంటేటర్ ఇష గుహ అయితే లబూషేన్ సిగరెట్ కాల్చాలని అనుకుంటున్నాడేమో అంటూ సహచరులతో డిస్కస్ చేశారు. మొత్తానికి లబూషేన్ చేసిన ఈ సంజ్ఞ తొలి రోజు ఆటకు హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో షికార్లు చేస్తుంది.
అసలు లబూషేన్ సిగరెట్ లైటర్ ఎందుకు అడిగాడంటే..?
అప్పటికే చాలాసేపుగా హెల్మెట్‌తో సమస్యను ఎదుర్కొంటూ పలుసార్లు తీస్తూ, వేసుకున్న లబూషేన్.. దాన్ని రిపేర్ చేసేందుకు గాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్‌కు మెసేజ్ చేశాడు. లబూషేన్ సైగ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అతనెందుకు లైటర్ అడుతున్నాడో అర్ధం కాలేదు. అయితే కాసేపటి తర్వాత విషయాన్ని గ్రహించి వారు లైటర్‌ను తీసుకెళ్లి లబూషేన్ సమస్యను పరిష్కరించారు. సిబ్బంది లైటర్‌తో లబూషేన్ హెల్మెట్ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశారు.
Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV
— cricket.com.au (@cricketcomau) January 4, 2023
ఇదిలా ఉంటే, వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్, లబూషేన్‌ల వికెట్లు అన్రిచ్ నోర్జే ఖాతాలో పడ్డాయి. కాగా, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment