AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది.
కమిన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో అతన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. నాలుగో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనప్పటికీ.. కేవలం ఒక్క ఓవర్ పాటు ఖ్వాజాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు కదా అని ఆసీస్ ఓపెనర్‌పై జాలిపడుతున్నారు. 2004లో నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా కమిన్స్ లాగే.. సహచరుడు సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదంతాన్ని నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఇవాళ (జనవరి 7) కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
నాలుగో రోజు 59 ఓవర్లు (ఎటువంటి అంతరాయం కలగకపోతే), ఆఖరి రోజు 98 ఓవర్ల ఆట సాధ్యపడితే ఫలితం (సౌతాఫ్రికాను 2 సార్లు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది) తప్పక వస్తుందన్న అంచనాతో కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆసీస్ బౌలర్లు 137.3 ఓవర్లలో సఫారీలను 2 సార్లు ఆలౌట్ చేశారు. ఈ ధీమాతోనే కమిన్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్), స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు.
కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు టీ విరామం సమయానికి (31 ఓవర్లు) 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment