85 ఏళ్ల రికార్డు సమం చేసిన యంగ్ పేసర్ (PC: cricket.com.au X)
#Shamar Joseph: ‘‘టెస్టు కెరీర్‌లో ఇంతకంటే గొప్ప ఆరంభం ఉండాలని ఎవరైనా కలగనగలరా?! ఈ అబ్బాయి చరిత్ర సృష్టించాడు’’.. వెస్టిండీస్ అరంగేట్ర పేసర్ షమార్ జోసెఫ్ గురించి కామెంటేటర్ అన్న మాటలు.
నిజమే.. జాతీయ జట్టుకు ఆడాలన్న చిరకాల కోరిక నెరవేర్చుకున్న 24 ఏళ్ల ఈ యువ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో.. అది కూడా పటిష్ట ఆస్ట్రేలియాతో టెస్టులో.. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ రూపంలో దిగ్గజ బ్యాటర్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
85 ఏళ్ల రికార్డు సమం
అంతేకాదు.. వెస్టిండీస్ చరిత్రలో 85 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సమం చేశాడు కూడా! విండీస్ తరఫున టెస్టు క్రికెట్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు.. 1939లో టిరెల్ జాన్సన్.. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా 23వ స్థానం
ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో 23వ బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు షమార్ జోసెఫ్. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా షమార్ జోసెఫ్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు
ఇక టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 188 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. కంగారూ జట్టు పేసర్లు ప్యాట్ కమిన్స్, హాజిల్‌వుడ్ నాలుగేసి వికెట్లు తీసి విండీస్‌ను కోలుకోని దెబ్బకొట్టారు.
వీరి ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా పదకొండో స్థానంలో బరిలోకి దిగిన షమార్ జోసెఫ్ కీమర్ రోచ్‌తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 41 బంతుల్లో 36 పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.
స్మిత్‌ను బోల్తా కొట్టించి మరీ
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో తిప్పలు పెట్టాడు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి స్మిత్‌ను బోల్తా కొట్టించాడు షమార్. గుడ్ లెంగ్త్ డెలివరీతో స్మిత్‌ను డిఫెన్స్‌లో పడేసి వికెట్ సమర్పించుకునేలా చేశాడు.
కాగా షమార్ బౌలింగ్‌లో బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
FIRST BALL!
— cricket.com.au (@cricketcomau) January 17, 2024
Shamar Joseph gets Steve Smith with his first ball in Tests! #OhWhatAFeeling | @Toyota_Aus | #AUSvWI pic.twitter.com/XLelMqZHrG
ఇదిలా ఉంటే... పదిహేనో ఓవర్ ఐదో బంతికి మార్నస్ లబుషేన్(10) రూపంలో రెండో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు షమార్. ఇక.. తొలి రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసిన ఆస్ట్రేలియా విండీస్ కంటే 129 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment