పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం | Australia Beat Pakistan By 360 Runs In First Test | Sakshi
Sakshi News home page

పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం

Published Sun, Dec 17 2023 3:10 PM | Last Updated on Sun, Dec 17 2023 4:11 PM

Australia Beat Pakistan By 360 Runs In First Test - Sakshi

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో)  పరిమితమైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్‌ మార్ష్‌ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (62) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్‌ లియోన్‌ 3, స్టార్క్‌, కమిన్స్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్‌) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్‌ ఖ్వాజా (90), మిచెల్‌ మార్ష్‌ (63 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, ఆమిర్‌ జమాల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. 

స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్‌ 2, కమిన్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో సౌద్‌ షకీల్‌ (24), బాబర్‌ ఆజమ్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్‌ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్‌ కూడా పడగొట్టిన మిచెల్‌ మార్ష్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి  కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement