బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ అని లాంగర్ పేర్కొన్నాడు. ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్!)
మూడో టెస్టు అనంతరం ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'ఈసారి ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్‌తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారీన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వన్డే సిరీస్, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్‌లు గాయపడగా.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్‌స్కీ లాంటి వారు గాయాలతో ఇబ్బంది పడ్డారు. (చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం')
తాజాగా టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లలో షమీ మొదలుకొని ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్‌కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్‌కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే ' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరు జట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment