వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుందని ఆ జట్టు సారధి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. తను, మిచెల్ స్టార్క్‌తో పాటు మరో పేసర్ స్కాట్ బోలండ్ తుది జట్టులో ఉంటాడని స్పష్టం చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్‌ను తుది జట్టులో ఆడిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. మూడో పేసర్‌గా బోలండ్ ఉంటాడని కన్ఫర్మ్ చేశాడు. నెసర్‌తో పోలిస్తే బోలండ్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే మేనేజ్‌మెంట్ అతనికి ఓటు వేసిందని తెలిపాడు.
గుడ్ లెంగ్త్ సీమ్ బౌలర్ అయిన బోలండ్.. హాజిల్‌వుడ్ కంటే కాస్త భిన్నమైన బౌలర్ అని, అతని బౌలింగ్‌లోని వైవిధ్యానికి టీమిండియా బ్యాటర్లు తప్పక ఇబ్బంది పడతారని ధీమా వ్యక్తం చేశాడు. తమ ఫాస్ట్ బౌలింగ్ త్రయం దెబ్బకు టీమిండియా విలవిలలాడక తప్పదని, గ్రీన్ రూపంలో తమకు మరో ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉందని అన్నాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే, తమ తరుపు ముక్క నాథన్ లియోన్ పని కానిచ్చేస్తాడని తెలిపాడు. మొత్తంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బరిలోకి దించబోయే తుది జట్టుపై సారధి ప్యాట్ కమిన్స్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా సైతం మరికొద్ది గంటల్లో తుది జట్టులో ఎవరెవరు ఉంటారో ప్రకటించవచ్చు. వికెట్‌కీపర్ ఎంపిక విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతుంది. కేఎస్ భరత్‌ను ఎంపిక చేయాలా లేక ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. అలాగే బౌలర్ల విషయంలో కూడా యాజమాన్యానికి క్లారిటీ లేదు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల ఆడించాలని అనుకుంటున్నప్పటికీ, వారు ఎవరనే దానిపై స్పష్టత లేదు.
తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment