
24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారమే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కంగారు మొదలైంది.
ఉగ్రవాదుల దాడుల భయంతో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఏ జట్టు ఇష్టపడలేదు. దీనికి తోడూ 2009లో పాక్ పర్యటనకు వచ్చిన లంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో లంక క్రికెటర్లు సమరవీర, జయవర్దనే, సంగక్కర సహా తదితర క్రికెటర్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులతో పాటు ఇద్దరు దేశ పౌరులు కాల్పులకు బలయ్యారు.
దీంతో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇతర దేశాలు నిరాకరించాయి. అయితే ఇటీవలే మా దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పీసీబీ స్వయంగా వెల్లడించింది. కాగా తమ దేశంలో సిరీస్ ఆడేందుకు రావాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. ఆ దేశం కోరికను మన్నించి ఇక్కడకు వచ్చింది. 1998లో ఆఖరుసారిగా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. ఆ తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది.
తాజాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడడానికి ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై మరోసారి అడుగుపెట్టింది. సిరీస్ నిర్వహణ సజావుగా సాగుతుందా..? అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ భయపడినట్లే జరిగింది. శుక్రవారం పెషావర్‌లోని కిస్సా ఖవానీ బజార్ ఏరియాలోని మసీదులో బాంబు పేలుడు కలవరం రేపింది. పెషావర్ బాంబు దాడి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రాంతం రావల్పిండికి ఏమంత దూరం కాకపోవడంతో సీఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే పాక్ లో ఉన్న తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆసీస్ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నది. భద్రతకు సంబంధించి ఏ ఆటగాడికి ఇబ్బంది కలిగినా తిరిగి స్వదేశానికి రావొచ్చని సీఏ సూచించినట్టు సమాచారం. అయితే బాంబు దాడి నేపథ్యంలో సీఏ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ విషయం పక్కనబెడితే.. తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (127 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (44)ఫర్వాలేదనిపించాడు ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. అబ్దుల్లా నిష్క్రమణతో వచ్చిన అజర్ అలీ (59 బ్యాటింగ్) కలిసి ఇమామ్ ఇన్నింగ్సును నడిపిస్తున్నాడు.
ఇక శుక్రవారం కావడంతో ప్రార్థనలకు వెళ్లిన చాలా మంది అమాయకులు బాంబుదాడిలో మరణించారు. అయితే సాయుధులై ఉన్న తీవ్రవాదులు.. ముందు ప్రజలపై కాల్పులు జరుపుదామని ప్రయత్నించినా.. అది వీలుకాకపోవడంతో ఆత్మాహుతికి దిగారని తెలుస్తున్నది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ కూడా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. గాయపడిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులన ఆస్పత్రులకు తరలించి తగిన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Suicide bombing at Shi'ite mosque in Pakistan's Peshawar kills at least 30 https://t.co/yL6Ssty5f7 pic.twitter.com/rGgAXAimG8
— Reuters (@Reuters) March 4, 2022
Comments
Please login to add a commentAdd a comment