Djokovic To Sue Australian Govt: వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనను ఆడనీయకుండా అడ్డుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. స్కాట్ మోరిసన్ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. తన 21వ గ్రాండ్‌స్లామ్ కలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడాన్ని కారణాలుగా చూపుతూ 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని డిసైడయ్యాడు. దీనిపై ప్రస్తుతం లాయర్లతో చర్చిస్తున్నాడు.
కాగా, ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్ళిన జకోవిచ్‌ను కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. జకో.. టోర్నీలో పాల్గొనేందుకు నిర్వహకులు అనుమతించినప్పటికీ, ఆ దేశ ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించింది. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతన్ని దేశంలోకి అనుమతించలేమని, అలాగే అతని వీసాను కూడా రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన జకోకు మొదట్లో ఉపశమనం లభించినా.. ఆతర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వాన్నే విజయం వరించింది.
ఈ విషయాన్ని చాలా సీరియన్‌గా తీసుకున్న జకో.. స్వదేశానికి వెళ్లగానే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీతో పోలిస్తే అతను దావా వేయాలనుకున్న మొత్తం చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే, ఈ సెర్బియన్ యోధుడు ఇటీవలే ఔషధ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అతనికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే క్వాంట్ బయోరెస్ అనే ఔషధ తయారీ సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సదరు కంపెనీ సీఈఓ స్వయంగా వెల్లడించాడు.
చదవండి: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..!
Comments
Please login to add a commentAdd a comment