స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌కు షాక్‌.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా | Australian Open 2025: Daniil Medvedev Slapped AUD 76,000 Fine For Misconduct In Tournament | Sakshi
Sakshi News home page

స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌కు షాక్‌.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా

Published Mon, Jan 20 2025 12:29 PM | Last Updated on Mon, Jan 20 2025 12:37 PM

Australian Open 2025: Daniil Medvedev Slapped AUD 76,000 Fine For Misconduct In Tournament

స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, 2021 యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు (రష్యా) షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌-2025 సందర్భంగా అతి చేసినందుకు గానూ మెద్వెదెవ్‌కు భారీ జరిమానా విధించారు నిర్వహకులు. మెద్వెదెవ్‌.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో నిష్క్రమించాడు. రెండు రౌండ్లలో మెద్వెదెవ్‌ చాలా దురుసగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ 76,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు.  

తొలి రౌండ్ లో మెద్వెదెవ్‌.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. గెలుపు అనంతరం విజయోత్సవ సంబురాల్లో భాగంగా పలు మార్లు తన రాకెట్‌తో నెట్ కెమెరాను బాదాడు. ఇలా చేసినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద అతనికి 10 వేల ఆసీస్‌ డాలర్ల జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించారు.

నిర్వహకులు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినా మెద్వెదెవ్‌ తీరు ఏ మాత్రం మారలేదు. రెండో రౌండ్‌ మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. ఈ రౌండ్ లో 19 ఏళ్ల అమెరికా కుర్రాడు, క్వాలిఫయర్ లెర్నర్ టీన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మెద్వెదెవ్‌.. ఓటమి అనంతరం సహనం కోల్పోయి రాకెట్‌ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి కొట్టాడు. తన రాకెట్ బ్యాగ్‌ను విసిరేశాడు. మరోసారి కెమెరాపై తన ప్రతాపాన్ని చూపాడు.

మెద్వెదెవ్‌ ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న నిర్వహకులు ఈసారి 66 వేల ఆసీస్‌ డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండు రౌండ్లలో మెద్వెదెవ్‌  76 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 లక్షలు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొన్నందుకు గానూ మెద్వెదెవ్‌కు 1,24,000 ఆసీస్‌ డాలర్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంట్లో సగానికి పైగా అతను జరిమానా కింద కోల్పోయాడు.

కాగా, 2021, 2022, 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో భంగపడ్డ మెద్వెదెవ్‌.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మరోసారి అతడికి నిరాశే ఎదురైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement