బాబ‌ర్ ఆజం క‌థ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ? | Babar Azam 20-month Wait For Test Half-century Continues As He Falls For 31 Vs Bangladesh, See Details Inside | Sakshi

#Babar Azam: బాబ‌ర్ ఆజం క‌థ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?

Sep 1 2024 8:16 AM | Updated on Sep 1 2024 12:55 PM

Babar Azams 20-month wait for Test half-century continues as he falls for 31 vs Bangladesh

బాబ‌ర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాదు వ‌ర‌ల్డ్ క్రికెట‌లోనే అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు. కెప్టెన్సీతో పాటు త‌న క్లాసిక్ ఇన్నింగ్స్‌ల‌తో పాక్‌కు ఎన్నో అద్భుత విజ‌యాల‌ను అందించాడు. బాబ‌ర్ క్రీజులో ఉన్నాడంటే పాక్‌ డ‌గౌట్‌లో కొండంత బ‌లం. 

టీ20ల్లో కాస్త స్లోగా ఆడుతాడ‌ని పేరు ఉన్న‌ప్ప‌ట‌కి మిగితా రెండు ఫార్మాట్ల‌లో త‌నకు తిరుగులేద‌ని బాబ‌ర్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ ఇదింతా ఒక‌ప్పుడు. గ‌త కొంత కాలంగా బాబ‌ర్ బ్యాట్ ముగిబోయింది.

ఒక‌నొక ద‌శ‌లో భార‌త స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లితో పోటీ ప‌డిన ఈ పాకిస్తానీ క్రికెట‌ర్‌కు ఇప్పుడు ఏమైంది. క‌నీసం హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను కూడా అందుకోవ‌డానికి తెగ క‌ష్ట‌ప‌డ‌తున్నాడు. ముఖ్యంగా త‌న ఫేవ‌రేట్ టెస్టు క్రికెట్‌లో కూడా బాబ‌ర్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు.

బాబ‌ర్‌కు ఏమైంది?
స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో బాబ‌ర్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. తొలి టెస్టులో కేవ‌లం 22 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఆజం.. ఇప్పుడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విఫ‌ల‌మయ్యాడు. కేవ‌లం 31 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. స్పిన్న‌ర్ల‌కు అద్బుతంగా ఆడుతాడ‌ని పేరు గాంచిన బాబ‌ర్‌.. అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. ష‌కీబ్ అల్ హ‌స‌న్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత స‌మ‌యం తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ చేశాడు. ఆఖ‌రికి ష‌కీబ్ బౌలింగ్‌లో బాబ‌ర్ ఇన్నింగ్స్ ముగిసింది.

చివ‌రి హాఫ్ సెంచ‌రీ ఎప్పుడంటే?
బాబ‌ర్ ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి దాదాపు 20 నెల‌లు దాటింది. అత‌డు చివ‌ర‌గా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్ప‌టి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాట‌లేక‌పోతున్నాడు. 

గ‌త 20 నెల‌ల‌లో టెస్టుల్లో అతడు సాధించిన అత్య‌ధిక స్కోర్ 41 ప‌రుగులే కావ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌వ‌రి 2023 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 15 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 స‌గ‌టుతో కేవ‌లం 320 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. క‌నీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాబ‌ర్ త‌న మార్క్‌ను చూపిస్తాడో లేదో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement