'పాకిస్తాన్ జ‌ట్టుకు క్యాన్స‌ర్‌.. ఆ న‌లుగురు చాలా డేంజ‌రస్‌' | Babar Azam was very stubborn, wasnt ready to accept changes: Mohammad Wasim | Sakshi
Sakshi News home page

'పాకిస్తాన్ జ‌ట్టుకు క్యాన్స‌ర్‌.. ఆ న‌లుగురు చాలా డేంజ‌రస్‌'

Published Tue, Sep 3 2024 9:50 AM | Last Updated on Tue, Sep 3 2024 11:34 AM

Babar Azam was very stubborn, wasnt ready to accept changes: Mohammad Wasim

పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజం గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అత‌డు టెస్టుల్లో హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకుని 20 నెల‌లు దాటింది. కనీసం స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనైనా బాబ‌ర్ త‌న రిథ‌మ్‌ను పొందుతాడ‌ని అంతా ఆశించారు. 

కానీ బంగ్లా సిరీస్‌లో కూడా బాబ‌ర్ తీవ్ర నిరాశ‌పరిచాడు. రెండు టెస్టుల్లోనూ ఆజం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో బాబ‌ర్ ఇంటాబ‌య‌టా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ మాజీ సెలెక్టర్ మహ్మద్ వసీం ఆజంను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

బాబ‌ర్‌ చాలా మొండి పట్టుదలగలవాడని, అత‌డితో  ప‌నిచేయ‌డం కష్ట‌మ‌ని  వసీం చెప్పుకొచ్చాడు. కాగా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత పాక్‌ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి ఆజం తప్పుకున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌-2024 ముందు తిరిగి మళ్లీ పాక్‌ వైట్‌బాల్‌ కెప్టెన్సీ బాధ్యతలను బాబర్‌ చేపట్టాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఘోర ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే పాక్‌ ఇంటిముఖం పట్టింది.

"బాబ‌ర్ ఆజం ఎవ‌రి మాట విన‌డు. చాలా మొండి పట్టుదలతో ఉంటాడు. జ‌ట్టులో మార్పులకు అస్స‌లు అంగీకరించక‌పోయేవాడు. జ‌ట్టు సెల‌క్ష‌న్ స‌మ‌యంలో కొత్త ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసేందుకు నా ప‌రిమితి దాటి మ‌రి అత‌డిని ఒప్పించేవాడిని" అని ఓ లోక‌ల్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వసీం పేర్కొన్నాడు.

పాకిస్థాన్ జట్టుకు క్యాన్సర్
కొంత‌మంది ఆట‌గాళ్లు పాక్‌ జ‌ట్టుకు క్యాన్సర్ గ‌డ్డ‌లా మారారు. న‌లుగురు కోచ్‌ల‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత జట్టుకు నష్టం కలిగించే ఆటగాళ్ల గ్రూపును నేను గుర్తించాను. వారి పేర్లు మాత్రం నేను చెప్పాల‌నుకోవ‌డం లేదు. ఆ త‌ర్వాత వారిని జ‌ట్టు నుంచి త‌ప్పించిడానికి నేను ప్ర‌య‌త్నించాను. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మ‌ళ్లీ వారిని రీకాల్ చేసింద‌ని వసీం తెలిపాడు.

ఓటమి అంచుల్లో పాక్‌..
ఇక వన్డే ప్రపంచకప్‌-2023లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌లలో ఓటమి చవిచూసిన పాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఘోరపరాభావం పొందింది. ఇప్పుడు టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి సారి బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పాక్‌ పడింది. బంగ్లాతో తొలి టెస్టులో పరాజయం పాలైన మసూద్‌ సేన.. ఇప్పుడు రెండో టెస్టులో ఓటమి అంచున నిలిచింది. బంగ్లా విజయానికి ఇంకా 143 పరుగులు మాత్రమే అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement