
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రస్తుత సీజన్‌లో ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కొత్త కెప్టెన్ (రవీంద్ర జడేజా) నేతృత్వంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ ఓటమిపాలై మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ సీఎస్‌కేకు మరో భారీ షాక్ తగిలింది. 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది.
Deepak Chahar ruled out of IPL 2022. (Reported by TOI).
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2022
తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
అయితే ఈ విషయంపై సీఎస్‌కే మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్ చాహర్ తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎస్‌కే ఇవాళ (ఏప్రిల్ 12) తమ 5వ మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.
చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్