BAN vs AFG, 2nd T20: After Virat, Shakib Won Most Player Of The Match Awards Among Active Cricketers - Sakshi
Sakshi News home page

BAN VS AFG 2nd T20: కోహ్లి తర్వాతి స్థానంలో షకీబ్‌.. మూడో స్థానంలో రోహిత్‌ శర్మ

Published Mon, Jul 17 2023 2:41 PM | Last Updated on Mon, Jul 17 2023 2:50 PM

BAN VS AFG 2nd T20: After Virat Shakib Won Most Player Of The Match Awards Among Active Cricketers - Sakshi

బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల విషయంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించడంతో షకీబ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 42వ సారి మ్యాన్‌ ఆఫ్‌్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లి ఒక్కడే ఈ విభాగంలో షకీబ్‌ కంటే ముందున్నాడు.

కోహ్లి అత్యధికంగా 63 మ్యాచ్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకుంటే, షకీబ్‌ 42 సార్లు, ఆతర్వాత రోహిత్‌ (37), వార్నర్‌ (37), గప్తిల్‌ (34), కేన్‌ విలియమ్సన్‌ (28), స్టీవ్‌ స్మిత్‌ (26), డికాక్‌ (25), రూట్‌ (25), జడేజా (24) వరుసలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే.. క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు అందుకున్న ఘనత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ సొంతం చేసుకున్నాడు. సచిన్‌ అత్యధికంగా 76 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో సచిన్‌ తర్వాత విరాట్‌, జయసూర్య (58), కలిస్‌ (57), సంగక్కర (50), పాంటింగ్‌ (49), అఫ్రిది (43) వరుసలో ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (22), అజ్మతుల్లా (25), కరీం జనత్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3, ముస్తాఫిజుర్‌, షకీబ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. లిటన్‌ దాస్‌ (35), ఆఫీఫ్‌ హొస్సేన్‌ (24), షకీబ్‌ (18 నాటౌట్‌) రాణించడంతో 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ముజీబ్‌, ఓమర్‌జాయ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌తో తొలి మ్యాచ్‌లోనూ నెగ్గిన బంగ్లాదేశ్‌ 2-0తో ఆఫ్ఘనిస్తాన్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ (2-1), ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌ గెలుచుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement