న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. భారీ విజయంతో.. | Ban vs NZ 1st Test Bangladesh Beat New Zealand By 150 Runs Creates History | Sakshi
Sakshi News home page

Ban vs NZ: న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. భారీ విజయంతో..

Published Sat, Dec 2 2023 10:54 AM | Last Updated on Sat, Dec 2 2023 11:39 AM

Ban vs NZ 1st Test Bangladesh Beat New Zealand By 150 Runs Creates History - Sakshi

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ (PC: ICC X)

Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్‌ జట్టుకు బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్‌ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.

కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

 ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్‌ కాగా.. న్యూజిలాండ్‌ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్‌ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్‌ 181 పరుగులకే చాపచుట్టేసింది.

బంగ్లాదేశ్‌ వెటరన్‌ స్పిన్నర్‌, తైజుల్‌ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. డెవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌, టామ్‌ బ్లండెల్‌ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్‌.. కైలీ జెమీషన్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీలను కూడా అవుట్‌ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు.

టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర
ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్‌ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్‌కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం.

నాలుగో రోజు ఆట ముగిసిందిలా
కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్‌ మిచెల్‌ (44 నాటౌట్‌) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌‌ రహీమ్‌ (67), మెహదీ హసన్‌ మిరాజ్‌ (50 నాటౌట్‌) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్‌ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్‌ నయీం హసన్‌ తొలి వికెట్‌ తీయగా.. తైజుల్‌ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ ఓటమిని ఖరారు చేశాడు.

చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య
టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం! కుమారుల కోసం అలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement