బంగ్లా ఆల్‌రౌండర్‌ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా! | Ban vs SA 1st Test: Mehidy Hasan Miraz Turns Saviour On Day 3, Creates Record | Sakshi
Sakshi News home page

బంగ్లా ఆల్‌రౌండర్‌ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా!

Published Wed, Oct 23 2024 5:27 PM | Last Updated on Wed, Oct 23 2024 6:57 PM

Ban vs SA 1st Test: Mehidy Hasan Miraz Turns Saviour On Day 3, Creates Record

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు(2) తీయడంతో పాటు బ్యాట్‌ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. మిరాజ్‌ సూపర్‌ బ్యాటింగ్‌ కారణంగానే బంగ్లా ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుని మళ్లీ పోటీలోకి వచ్చే స్థితిలో నిలిచింది.

106 పరుగులకే ఆలౌట్‌
కాగా రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సోమవారం ఢాకా వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ప్రొటిస్‌ బౌలర్ల ధాటికి నిలవలేక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

202 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా
సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, వియాన్‌ ముల్దర్‌, కేశవ్‌ మహరాజ్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. డేన్‌ పీడ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 308 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కంటే 202 రన్స్‌ ఆధిక్యంలో నిలిచింది. 

అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ షాద్మన్‌ ఇస్లాం(1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌(0) పూర్తిగా విఫలమయ్యారు.

ఈ దశలో మరో ఓపెనర్‌ మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ 40 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో(23) అతడికి సహకరించాడు. సీనియర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం(33) స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడగా.. వికెట్‌ కీపర్‌ లిటన్‌ దాస్‌ 7 పరుగులకే అవుటయ్యాడు.

మిరాజ్‌ మిరాకిల్‌
ఫలితంగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలయ్యే దుస్థితిలో బంగ్లాదేశ్‌ ఉన్న వేళ మెహదీ హసన్‌ మిరాజ్‌ ఆపద్భాందవుడిగా ఆదుకున్నాడు. ఏడోస్థానంలో ‍బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఊహించని రీతిలో సౌతాఫ్రికా బౌలర్లకు షాకిచ్చాడు.

తన బ్యాటింగ్‌ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 171 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జాకిర్‌ అలీ సైతం హాఫ్‌ సెంచరీ(58)తో రాణించాడు.

సరికొత్త రికార్డు
ఈ క్రమంలో వీరిద్దరు కలిసి సౌతాఫ్రికాపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జోడీగా మెహదీ హసన్‌ మిరాజ్‌- జాకిర్‌ అలీ నిలిచారు. ఈ సందర్భంగా హబీబుల్‌ బషార్‌- జావేద్‌ ఒమర్‌(131 రన్స్‌) పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేశారు.

ఎట్టకేలకు లీడ్‌లోకి
ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి మిరాజ్‌ 87, నయీం హసన్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్‌ 85 ఓవర్ల ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి.. 81 పరుగుల లీడ్‌లోకి వచ్చింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.    
చదవండి: Ind vs NZ: అతడి​ ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement