BCCI announces India's domestic season for 2023-24 - Sakshi
Sakshi News home page

బీసీసీఐ నుంచి బిగ్‌న్యూస్‌

Published Tue, Apr 11 2023 12:14 PM | Last Updated on Tue, Apr 11 2023 12:29 PM

BCCI Announces Indias Domestic Season For 2023 24 - Sakshi

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇవాళ (ఏప్రిల్‌ 11) ఓ బిగ్‌న్యూస్‌ వెలువడింది. 2023-24 భారత దేశవాలీ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జూన్‌ 2023-మార్చి 2024 మధ్యలో సాగే ఈ సీజన్‌లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2023 జూన్‌ 28న మొదలయ్యే దులీప్‌ ట్రోఫీతో ఈ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ జులై 16, 2023న ముగుస్తుంది.

ఆ వెంటనే జులై 24-ఆగస్ట్‌ 3 మధ్యలో దియోధర్‌ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్‌, సౌత్‌, నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌-ఈస్ట్‌) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీ తర్వాత అక్టోబర్‌ 1 నుంచి రంజీ ఛాంపియన్‌ సౌరాష్ట్ర-రెస్ట్‌ ఆఫ్‌ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ మొదలవుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్‌ (టెస్ట్‌ ఫార్మాట్‌) టోర్నీల తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్‌), విజయ్‌ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్‌) లు మొదలవుతాయి.

ముస్తాక్‌ అలీ ట్రోఫీ అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 6 వరకు జరుగనుండగా..  విజయ్‌ హజారే ట్రోఫీ నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. అనంతరం 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలుకానుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. 

ఇక మహిళల క్రికెట్‌ విషయానికొస్తే.. సీనియర్‌ వుమెన్స్‌ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్‌ 19 నుంచి నవంబర్‌ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్‌ 24-డిసెంబర్‌ 4 మధ్యలో సీనియర్‌ వుమెన్స్‌ ఇంటర్‌ జోనల్‌ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్‌ వుమెన్స్‌ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement