ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొన్న బీసీసీఐ సభ్యులు
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
ఐపీఎల్‌లో అదనపు జట్లు
2022 ఐపీఎల్‌లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్‌తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు.
పన్ను రాయితీలపై ఎలా?
2021లో భారత్‌లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్‌లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్‌కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఒలింపిక్స్‌కు నో
2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు.
ఫ్రెండ్లీ మ్యాచ్...
ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్‌గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ప్రజ్ఞాన్ ఓజా
క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment