India Next T20 Captain: టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? ఏడాది తర్వాత టీ20 ఫార్మాట్ కెప్టెన్‌ను మార్చేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? నాయకత్వ మార్పు అంశంపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ సన్నిహిత వర్గాలు.
గతేడాది పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా.. రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ సారథ్యంలో స్వదేశంలో, విదేశాల్లో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన భారత జట్టు.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఆడుతోంది.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం విదితమే. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఎడిషన్‌లో భాగంగా టీమిండియా పలు కీలక మ్యాచ్‌లు ఆడనుంది.
అప్పటికి రోహిత్ కెప్టెన్‌గా ఉండబోడు!
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలపై భారం తగ్గించి.. ఈ రెండు ఫార్మాట్లపైనే దృష్టి సారించేలా యాజమాన్యం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా.. 35 ఏళ్ల రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా లేదంటే రిషభ్ పంత్‌కు టీ20 కెప్టెన్సీని బదలాయించాలనే యోచనలో ఉందట. వరల్డ్‌కప్-2024 నాటికి కొత్త నాయకత్వంలో టీమిండియా సంసిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తోందట.
ఇద్దరి వయస్సు 30 ఏళ్లకు పైనే కదా!
ఈ విషయాల గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో అతి ముఖ్యమైన ఆటగాళ్లు. అయితే వాళ్లిద్దరి వయసు ఇప్పుడు 30 ఏళ్లకు పైనే!
అలా అని వాళ్లను ఒక ఫార్మాట్‌కే పరిమితం చేయాలనే ఆలోచన లేదు గానీ.. ఐసీసీ టోర్నీలు, ప్రతిష్టాత్మక సిరీస్‌ల దృష్ట్యా వారికి కావాల్సినంత విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. అయితే, ప్రతిసారీ కెప్టెన్‌ను రొటేట్ చేయలేం కదా!
ప్రస్తుత ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20ల కంటే కూడా వన్డే, టెస్టులపైనే ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా టీ20 కెప్టెన్సీని రోహిత్ నుంచి హార్దిక్, కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్‌కు బదలాయించే అవకాశం ఉంది.
ఇప్పటికే కెప్టెన్లుగా నిరూపించుకున్నారు
హార్దిక్, రిషభ్ ఇప్పటికే కెప్టెన్లుగా తమను తాము నిరూపించుకున్నారు. ఐపీఎల్‌లో సారథులుగా వ్యవహరించిన అనుభవం వారికి ఉంది. కేఎల్ కూడా రేసులో ఉంటాడు. ఏదేమైనా 2023 వరల్డ్‌కప్ తర్వాత పూర్తిస్థాయిలో మార్పులు మాత్రం తథ్యం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా టీ20 ఫార్మాట్‌లో కేవలం మేజర్ సిరీస్‌లకు మాత్రమే కోహ్లిని ఎంపిక చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.
కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ గైర్హాజరీలో అడపాదడపా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో సైతం టీ20 సిరీస్ ఆడనున్న జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.
చదవండి: బుమ్రా ఇకపై ఐపీఎల్ మాత్రమే ఆడతాడా..?
కివీస్‌తో సిరీస్ నుంచి అవుట్! డీకే కెరీర్ ముగిసిపోయినట్లేనా? అతడిని ఎందుకు ఎంపిక చేయలేదంటే!
Comments
Please login to add a commentAdd a comment