భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 45 లీగ్ దశలో.. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లు(రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్) ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లకు పది వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. వార్మప్ మ్యాచ్‌లకు మరో రెండు మైదానాలను(త్రివేండం, గుహవాటి) ఎంపిక చేసింది.
అయితే ఈ వరల్డ్‌కప్‌కు పలు స్టేడియాలకు మ్యాచ్‌లు కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు గుర్రుగా ఉన్నాయి. వరల్డ్‌కప్ వేదికల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈసారి వరల్డ్‌కప్ వేదికల జాబితాలో నాగ్‌పూర్, మొహాలీ, జైపూర్ లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా మొహాలీ వేదికపై దుమారం నెలకొంది.
1996 నుంచి ప్రపంచకప్ మ్యాచులకు ఇది వేదికగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు. రాజకీయ జోక్యం వల్లే మొహాలిని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మొహాలీకి చేయిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు.
ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి పన్నెండు వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్‌ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు జరుగుతాయి.
మ్యాచ్‌లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలో జరిగింది. మొహాలీలోని మల్లాన్‌పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌కు వేదికయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేదు.
అందుకే ఈసారి అవకాశం రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను కేటాయించాం. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అందులోనూ ఎన్నోసార్లు చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి'' అని శుక్లా వెల్లడించారు.
చదవండి: వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా!
2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా అంటూ జోస్యం!
Comments
Please login to add a commentAdd a comment