BCCI Vice-President Rajeev Shukla Confirms IPL To Reschedule On 18 th September In UAE - Sakshi
Sakshi News home page

IPL2021: ఐపీఎల్‌... ఓవర్‌ టూ యూఏఈ 

Published Sat, May 29 2021 2:17 PM | Last Updated on Sun, May 30 2021 6:30 AM

BCCI Vice President Rajeev Shukla Says IPL 2021 Moved To UAE - Sakshi

Courtesy: IPL

ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) అనంతరం బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం.  2021 ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్‌ సహా లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. భారత్‌లో కరోనా తీవ్రత మరింత పెరిగిపోవడంతో ఈ సీజన్‌లో మన దేశంలో మాత్రం మ్యాచ్‌లు నిర్వహించలేమని స్పష్టమైంది.

దాంతో ప్రత్యామ్నాయ వేదికగా మరోసారి యూఏఈవైపే బీసీసీఐ చూసింది. 2020లో మొత్తం టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటనలో కోవిడ్‌–19 కారణంగా వేదిక మారినట్లు కాకుండా సెప్టెంబర్‌–అక్టోబర్‌ సమయంలో భారత్‌లో వర్షాకాలం కాబట్టి మ్యాచ్‌లు ఇబ్బంది కలగకుండా వేదిక మార్చినట్లు ఉండటం గమనార్హం. మరోవైపు తాజా షెడ్యూల్‌ ప్రకారం చూస్తే తమ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడరని ఇంగ్లండ్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించగా... కీలకమైన ఆస్ట్రేలియా బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎస్‌జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్‌ ఆటగాళ్ల కోసం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది.  


హెచ్‌సీఏ నుంచి అజహరుద్దీన్‌...
సుదీర్ఘ వివాదం అనంతరం బీసీసీఐ వర్చువల్‌ సమావేశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తరఫున అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ హాజరయ్యాడు. అజహర్‌ వైరి వర్గం కొన్నాళ్ల క్రితం హెచ్‌సీఏ ప్రతినిధిగా శివలాల్‌ యాదవ్‌ పేరును ప్రతిపాదించి పంపించినా... బోర్డు దానిని పట్టించుకోకుండా అజహర్‌కే అవకాశం కల్పించింది.

టి20 వరల్డ్‌కప్‌ కోసం వేచి చూద్దాం 
కరోనాతో ఐపీఎల్‌ విదేశానికి తరలి పోగా... అక్టోబర్‌–నవంబర్‌లోనే జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను భారత్‌ నిర్వహించగలదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 16 జట్లతో ఒక ఐసీసీ ఈవెంట్‌ను జరపడం అంత సులువు కాదు. అప్పటికి భారత్‌లో కోవిడ్‌–19 కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కానీ... పూర్తిగా వైరస్‌ తగ్గిపోతుందనుకోవడం కూడా అత్యాశే. అందుకే బోర్డు వేచి చూసే ధోరణిలో ఉంది. భారత్‌ నుంచి టి20 ప్రపంచకప్‌ను తరలించే ఆలోచనతో ఉన్న ఐసీసీని బీసీసీఐ మరో నెలరోజులు గడువు ఇవ్వాలని కోరనుంది.

వరల్డ్‌కప్‌ను సమస్యలు లేకుండా నిర్వహించే క్రమంలో ఒకే ప్రాంతంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలనే ఆలోచనతో కూడా బోర్డు ఉంది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు దగ్గర్లోనే పుణేను వాడుకుంటే ఎలా ఉంటుందనేది ఒక సూచన. జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా దుబాయ్‌ వెళ్లనున్నారు. అక్కడే ఐపీఎల్‌ నిర్వహణ గురించి యూఏఈ బోర్డుతో కూడా చర్చిస్తారు. మరోవైపు రంజీ క్రికెటర్లకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదు.  

(చదవండి: IPL 2021: ఎప్పుడు నిర్వహిద్దాం?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement