Ben Stokes To Shahid Afridi: Who Reversed Retirement Decision To Play For Their Country - Sakshi
Sakshi News home page

Ben Stokes: తూచ్‌! తిరిగి ఆడతాం.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్‌ మాదిరే వీళ్లు కూడా..

Published Thu, Aug 17 2023 6:53 PM | Last Updated on Tue, Oct 3 2023 6:41 PM

Ben Stokes To Afridi Who Reversed Retirement Decision To Play For Their Country - Sakshi

Who Reversed Retirement Decision: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌-2019 హీరో బెన్‌ స్టోక్స్‌ తమ బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ వన్డేలు ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సఫలమైంది. దాంతో న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. 

15 మందితో కూడిన టీమ్‌ను ఈ సిరీస్‌ కోసం ఈసీబీ ప్రకటించింది. వరల్డ్‌ కప్‌ కోసం టీమ్‌ను ప్రకటించేందుకు మరింత సమయం ఉన్నా... సెలక్టర్‌ ల్యూక్‌ రైట్‌ చెప్పిన దాని ప్రకారం మార్పుల్లేకుండా ఇదే బృందం వరల్డ్‌ కప్‌కూ కొనసాగే అవకాశం ఉంది. మరి దేశం కోసం.. స్టోక్స్‌ మాదిరే తమ రిటైర్మెంట్‌ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసా?

షాహిద్‌ ఆఫ్రిది
పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది తన కెరీర్‌లో ఏకంగా ఐదుసార్లు రిటైర్మెంట్‌ ప్రకటనలు ఇచ్చాడు. 2006లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. అయితే, రెండు వారాల్లోనే తన నిర్ణయం మార్చుకున్నాడు మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో పాక్‌ తరఫున బరిలోకి దిగాడు. ఎట్టకేలకు 2010లో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

అదే విధంగా.. 2011, మేలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆఫ్రిది.. నెలల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత వన్డేల నుంచి తప్పుకొన్న ఆఫ్రిది.. 2017లో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కూ స్వస్తి పలికాడు.

మొయిన్‌ అలీ
ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ 2021 సెప్టెంబరులో టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌-2023 నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతగడ్డపై ఆసీస్‌తో పోరులో జట్టుకు అండగా నిలిచే క్రమంలో బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ మైదానంలో దిగాడు.

బజ్‌బాల్‌ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ డ్రాతో గట్టెక్కడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక ఈ టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత మరోసారి తన రిటైర్మెంట్‌ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇంగ్లండ్‌ తరఫున సంప్రదాయ క్రికెట్‌ ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు.

తమీమ్‌ ఇక్బాల్‌
బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా వన్డే కప్‌, వన్డే వరల్డ్‌కప్‌-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించి బంగ్లాను సందిగ్దంలో పడేశాడు.

అయితే, ప్రధాని షేక్‌ హసీనా జోక్యంతో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపై కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని తమీమ్‌ చెప్పుకొచ్చాడు.

డ్వేన్‌ బ్రావో
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 2018, అక్టోబరులో అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ మరుసటి ఏడాది డిసెంబరులో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కీరన్‌ పొలార్డ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బ్రావో తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్వయంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్‌-2021లో విండీస్‌ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌.. ఈ ఐసీసీ ఈవెంట్‌ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. 

చదవండి: జట్టులో చోటు లేకున్నా పర్లేదు.. వాటి కారణంగా రిటైర్‌ అవ్వను: టీమిండియా స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement