ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు ఓలీ పోప్ నాయకత్వం వహించాడు. పోప్ నాయకత్వంలో ఇంగ్లండ్ నాలుగింట మూడు మ్యాచ్‌లు గెలిచింది.
తాజాగా స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ జట్టు బలం మరింత పెరిగినట్లైంది. స్టోక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్న క్రమంలో క్రిస్ వోక్స్‌కు తప్పించించి ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్. ఈ మార్పుతో పాటు ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ మరో మార్పు కూడా చేసింది. తొలి టెస్ట్‌లో ఆడిన గస్ అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి తీసుకుంది. స్టోక్స్ జట్టులో చేరిన క్రమంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి స్టోక్స్‌కే అప్పజెప్పాడు.
మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా భారీ మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను పక్కకు పెట్టింది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడే రెండు టెస్ట్‌లకు వీరు దూరంగా ఉంటారు. వీరితో పాటు డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్ కూడా రెండో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
పాక్‌తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.
చదవండి: బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment