photo credit: IPL 2023
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 2) జరిగిన ఉత్కంఠ సమరంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో గెలవదనుకున్న తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మపై దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 700 రోజుల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏళ్ల ఇషాంత్ శర్మ, కుర్ర బౌలర్‌లా రెచ్చిపోతున్నాడని.. ఈ మ్యాచ్‌లో అతను విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి నకుల్ బంతిని (స్లో డెలివరి) తానెప్పుడూ చూడలేదని, క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే అత్యుత్తమ నకుల్ బంతి అయ్యుంటుందని కొనియాడాడు.
భీకర ఫామ్‌లో ఉన్నటువంటి విజయ్ శంకర్‌ను ఇషాంత్ అద్భుతమైన బంతితో తెలివిగా బోల్తా కొట్టించాడని, ఊహించని రీతిలో బంతి వికెట్లను తాకడంతో విజయ్ శంకర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఆఖరి ఓవర్‌లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు.
Deception at its best! 👊🏻
— IndianPremierLeague (@IPL) May 2, 2023
What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase!
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X
ఆఖరి ఓవర్‌లో గుజరాత్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ కేవలం 6 మాత్రమే ఇచ్చి గుజరాత్ నోటి దాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఢిల్లీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు (19 పరుగులిచ్చి) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇదిలా ఉంటే, నిన్న ఢిల్లీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది. ఇషాంత్ శర్మ (2/23) ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..అమన్ హకీమ్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిపాల్ పటేల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. గుజరాత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (4/11) అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ రాణించినపట్పికీ తన జట్టును గెలిపించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment