Border Gavaskar Trophy (BGT) 2023, India Vs Australia, 3rd Test: Australia Beat India By 9 Wickets At Indore Holkar Stadium - Sakshi
Sakshi News home page

Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్‌ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం

Published Fri, Mar 3 2023 10:50 AM | Last Updated on Fri, Mar 3 2023 11:59 AM

BGT 2023 Ind Vs Aus 3rd Test: Australia Beat India By 9 Wickets - Sakshi

BGT 2023 Ind Vs Aus 3rd Test Indore: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆస్ట్రేలియా  ఎట్టకేలకు బోణీ కొట్టింది. మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో హ్యాట్రిక్‌ గెలుపు నమోదు చేయాలని భావించిన రోహిత్‌ సేనకు భంగపాటు తప్పలేదు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ తొలి విజయం సాధించడంతో టీమిండియాకు ఆఖరి టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆసీస్‌ స్పిన్నర్ల విజృంభణ
ఇండోర్‌ వేదికగా బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, బంతి తొలి రోజు నుంచే స్పిన్‌కు టర్న్‌ అయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించారు. మాథ్యూ కుహ్నెమన్‌ 5 వికెట్లతో చెలరేగగా, నాథన్‌ లియోన్‌ 3, టాడ్‌ మర్ఫీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

దీంతో మొదటి రోజే టీమిండియా కేవలం 109 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. విరాట్‌ కోహ్లి 22, శుబ్‌మన్‌ గిల్‌ 21 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు.

ఖవాజా ఇన్నింగ్స్‌ కారణంగా
ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసీస్‌ నడ్డి విరుస్తారని భావించిన సగటు అభిమానులకు నిరాశే ఎదురైంది. జడేజా 4, అశ్విన్‌ 3, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీసినప్పటికీ ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్‌ ఖవాజా 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

మళ్లీ విఫలమైన టీమిండియా బ్యాటర్లు
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. ఛతేశ్వర్‌ పుజారా ఒక్కడే అర్ధ శతకం(59 పరుగులు) చేయగా మిగతా వాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో ఎవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు.

దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి 163 పరుగులకు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగించింది. నాథన్‌ లియోన్‌ 8 వికెట్లతో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఫైనల్‌ అవకాశాలు మెరుగు
ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట మొదలుకాగానే అశ్విన్‌ ఖవాజా వికెట్‌ తీసి శుభారంభం అందించిన్పటికీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ 49 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 28 పరుగులతో రాణించాడు. ఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలు మెరుగయ్యాయి.

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మూడో టెస్టు స్కోర్లు:
ఇండియా- 109 & 163
ఆస్ట్రేలియా-  197 & 78/1
విజేత- ఆస్ట్రేలియా
4 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement