BGT 2024: సర్ఫరాజ్‌ ఖాన్‌పై వేటు.. మిడిలార్డర్‌లో అతడు ఫిక్స్‌! | BGT 2024: Is Dhruv Jurel to Replace Sarfaraz Khan After 80 Vs Aus A Clash | Sakshi
Sakshi News home page

BGT 2024: సర్ఫరాజ్‌ ఖాన్‌పై వేటు.. మిడిలార్డర్‌లో అతడు ఫిక్స్‌!

Published Thu, Nov 7 2024 12:45 PM | Last Updated on Thu, Nov 7 2024 1:59 PM

BGT 2024: Is Dhruv Jurel to Replace Sarfaraz Khan After 80 Vs Aus A Clash

టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కివీస్‌తో టెస్టులలో నో ఛాన్స్‌
కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్‌ జురెల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్‌ కీపర్‌ కోటాలో రిషభ్‌ పంత్‌ బరిలోకి దిగగా.. జురెల్‌ను పక్కనపెట్టారు.

అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతున్న భారత జట్టులో
ఇక కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్‌ రాహుల్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.

161 పరుగులకే ఆలౌట్‌
ఇక ఇప్పటికే ఆసీస్‌-ఎ, భారత్‌-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. నిజానికి భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్‌.

టాపార్డర్‌ కుప్పకూలి 11 పరుగులకే భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్‌ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు.  ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ఈ వికెట్‌ కీపర్‌ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. 

సహచరులంతా ఆసీస్‌ బౌలర్ల ధాటికి.. పెవిలియన్‌కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌పై వేటు వేసి
ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్‌ జురెల్‌ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్‌లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో జురెల్‌కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.

వికెట్‌ కీపర్‌గా పంత్‌ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్‌లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్‌కు లైన్‌ క్లియర్‌ అవుతుంది. కివీస్‌ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్‌ ఖాన్‌ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కివీస్‌తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్‌ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్‌కు బదులు జురెల్‌ ఆసీస్‌ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్‌ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్‌ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement