స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూల గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే భారత జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో తొలి టెస్టు నుంచే పట్టు బిగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనాన్ని మరచి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు కారణమైంది.
వారిద్దరు విఫలం
కాగా డబ్ల్యూటీసీలో భాగంగా కివీస్‌తో స్వదేశంలో సిరీస్‌లో రోహిత్ సేన బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లు రాణించినా.. కీలక బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆసీస్ గడ్డపై వీరిద్దరు మెరుగ్గా ఆడితేనే సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ ఇంట్రా- స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
అభిమానులకు బ్యాడ్‌న్యూస్
మొదటి టెస్టుకు వేదికైన పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. అయితే, ఈ వార్మప్ గేమ్‌ను ప్రేక్షకులు చూడకుండా లాక్‌డౌన్ విధించిందని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. అభిమానులను ఈ మ్యాచ్ చూసేందుకు అనుమతినివ్వడం లేదని తెలిపింది.
భారత్-ఎ జట్టుతో మ్యాచ్ రద్దు చేసి
నిజానికి బీసీసీఐ ముందుగా భారత్-ఎ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని భావించింది. అయితే, కారణమేమిటో తెలియదు కానీ దానిని రద్దు చేసి నెట్ సెషన్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాల నుంచి విమర్శలు రాగా.. మళ్లీ ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి సహా రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.
కోహ్లి డుమ్మా
ఇక వీరందరి కంటే ముందుగానే ఆసీస్‌లో అడుగుపెట్టి భారత్-ఎ జట్టుకు ఆడిన కేఎల్ రాహుల్‌తో పాటు యశస్వి, పంత్ మంగళవారం ప్రాక్టీస్ చేశారు. అయితే, కోహ్లి మాత్రం ఈ ఆప్షనల్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నవంబరు 22 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.
చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
Comments
Please login to add a commentAdd a comment