పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్‌లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి.
సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్‌కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు.
సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్
బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment