Yuki Bombri
-
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
యూకీ బాంబ్రీ నిష్క్రమణ
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్ దశలోనే భారత్ పోరాటం ముగిసింది. రెండో క్వాలిఫయిగ్ రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ 3–6, 2–6 స్కోరుతో జిజో బెరŠగ్స్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 552వ స్థానంలో ఉన్న యూకీ 155వ ర్యాంక్‌లో ఉన్న ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. ఈ టోర్నీలో ఇంతకు ముందే క్వాలిఫయింగ్ దశలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సుమీత్ నగాల్ ఓడిపోయారు. -
సెమీ ఫైనల్లో రామ్‌కుమార్–బోపన్న
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి. సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు. సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు. -
యూకీ బాంబ్రీ శుభారంభం
టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–7 (5/7), 2–6తో అల్ట్‌మైర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
సుమిత్‌కు భలే చాన్సులే!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు భలే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో అతనికి సింగిల్స్ విభాగంలో బెర్త్ దక్కింది. కరోనా భయాందోళనలు, ఆంక్షల నేపథ్యంలో చాలామంది ఆటగాళ్లు ప్రతిష్టాత్మక విశ్వక్రీడల నుంచి తప్పుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ‘విత్‌డ్రా’లు ఉండటంతో అనూహ్యంగా లోయర్ ర్యాంక్‌లో ఉన్న నగాల్‌కు ‘టోక్యో’ స్వాగతం చెప్పింది. కటాఫ్ తేదీ జూన్ 14 నాటికి సుమిత్ ర్యాంక్ 144. ఇతని కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న యూకీ బాంబ్రీ (127) గాయంతో తప్పుకున్నాడు. కటాఫ్ తేదీ వరకు 148వ ర్యాంక్‌లో ఉన్న ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా ఆశల పల్లకిలో ఉన్నాడు. ‘అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నగాల్ బెర్త్‌ను ఖరారు చేసింది. ఆడేందుకు నగాల్ కూడా ‘సై’ అనడంతో అక్రిడేషన్, తదితర ఏర్పాట్ల కోసం వెంటనే మేం భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమిచ్చాం’ అని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. సింగిల్స్‌లో సుమిత్ ఆడనుండటంతో పురుషుల డబుల్స్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలు బరిలో ఉండే అవకాశాలు పెరిగాయి. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్నతో సుమిత్ జత కట్టవచ్చు. ఒకవేళ బోపన్న ఎంట్రీ కూడా ఖరారైతే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో బోపన్న, సుమిత్లలో ఒకరు కలసి ఆడే అవకాశముంది. సియోల్–1988 ఒలింపిక్స్‌లో తొలిసారి టెన్నిస్‌ను ప్రవేశపెట్టాక భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న ఏడో ప్లేయర్ సుమిత్ నగాల్. గతంలో విజయ్ అమృత్‌రాజ్, జీషాన్ అలీ (1988), రమేశ్కృష్ణన్ (1992), లియాండర్ పేస్ (1992, 1996, 2000), విష్ణువర్ధన్, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (2012) ఈ ఘనత సాధించారు. -
రన్నరప్ యూకీ బాంబ్రీ
చెన్నై: సీజన్లో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. శనివారం ముగిసిన చెన్నై ఓపెన్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టాప్ సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ యూకీ 5–7, 6–3, 5–7తో పోరాడి ఓడిపోయాడు. రెండు గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఒక్క ఏస్ కూడా కొట్టకపోవడం గమనార్హం. తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయిన యూకీ, ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. అయితే కీలకదశలో థాంప్సన్ గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రన్నరప్ యూకీకి 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
డబుల్స్‌లో యూకీ జోడీ పరాజయం
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జోడి సెమీస్‌లో ఓడింది. యూకీ జంట 4–6, 6–7 (2/7)తో హెర్బెర్ట్–సిమోన్ (ఫ్రాన్స్) జోడి చేతిలో కంగుతింది. సింగిల్స్‌లో టాప్ సీడ్ మారిన్ సిలిచ్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. ఈ క్రొయేషియా ఆటగాడికి అన్‌సీడెడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 89వ ర్యాంకర్ సిమోన్ 1–6, 6–3, 6–2తో ఆరో ర్యాంకర్ సిలిచ్‌ను కంగుతినిపించాడు. 2015 సెప్టెంబర్ తర్వాత సిమోన్ ఏటీపీ టోర్నీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో అతను... ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరో సెమీస్‌లో కెవిన్ 6–7 (6/8), 7–6 (7/2), 6–1తో బెనొయిట్ పైర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. -
సెమీస్‌లో యూకీ జంట
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న–జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–దివిజ్ జోడీ 7–5, 2–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంటను బోల్తా కొట్టించింది. మరో మ్యాచ్‌లో బోపన్న–జీవన్ జంట 3–6, 5–7తో హెర్బర్ట్–గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పుణే ఓపెన్ విజేత యూకీ
పుణే: భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4–6, 6–3, 6–4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రామ్‌కుమార్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 10 డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ను కోల్పోయిన యూకీ వెంటనే తేరుకొని రెండో సెట్లో రెండుసార్లు, మూడో సెట్లో ఒకసారి రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన యూకీకి 7,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 68 వేలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రాంజల, నిధి ఓటమి మరోవైపు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ముంబై ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ప్రాంజల 0–6, 0–6తో అనా బొగ్డాన్ (రొమేనియా) చేతిలో, నిధి 1–6, 3–6తో అనా మోర్గినా (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో యూకీ
కర్షి: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ క్వార్టర్‌పైనల్లోకి చేరుకున్నా డు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడేడ్ యూకీ 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అల్దిన్ సెత్కిక్ (బోస్నియా హెర్జెగోవినా)పై శ్రమించి విజయం సాధించాడు. దాదాపు 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన యూకీ.. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, ప్రపంచ 96వ ర్యాంకర్ సెర్జీ స్టాకోవ్స్కీ (ఉక్రెయిన్)తో యూకీ తలపడనున్నాడు. మరోవైపు మరో భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. ఎగోర్ జెరామిసోవ్ (బెలారస్)తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 3–6, 4–6తో బాలాజీ ఓటమిపాలయ్యాడు. దాదాపు 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో రెండుసార్లు సర్వీస్ కోల్పోయిన భారత ప్లేయర్ మూల్యం చెల్లించుకున్నాడు.