న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు భలే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో అతనికి సింగిల్స్ విభాగంలో బెర్త్ దక్కింది. కరోనా భయాందోళనలు, ఆంక్షల నేపథ్యంలో చాలామంది ఆటగాళ్లు ప్రతిష్టాత్మక విశ్వక్రీడల నుంచి తప్పుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ‘విత్‌డ్రా’లు ఉండటంతో అనూహ్యంగా లోయర్ ర్యాంక్‌లో ఉన్న నగాల్‌కు ‘టోక్యో’ స్వాగతం చెప్పింది. కటాఫ్ తేదీ జూన్ 14 నాటికి సుమిత్ ర్యాంక్ 144. ఇతని కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న యూకీ బాంబ్రీ (127) గాయంతో తప్పుకున్నాడు.
కటాఫ్ తేదీ వరకు 148వ ర్యాంక్‌లో ఉన్న ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా ఆశల పల్లకిలో ఉన్నాడు. ‘అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నగాల్ బెర్త్‌ను ఖరారు చేసింది. ఆడేందుకు నగాల్ కూడా ‘సై’ అనడంతో అక్రిడేషన్, తదితర ఏర్పాట్ల కోసం వెంటనే మేం భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమిచ్చాం’ అని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. సింగిల్స్‌లో సుమిత్ ఆడనుండటంతో పురుషుల డబుల్స్‌లో, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీలు బరిలో ఉండే అవకాశాలు పెరిగాయి. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్నతో సుమిత్ జత కట్టవచ్చు. ఒకవేళ బోపన్న ఎంట్రీ కూడా ఖరారైతే మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో బోపన్న, సుమిత్‌లలో ఒకరు కలసి ఆడే అవకాశముంది.
సియోల్–1988 ఒలింపిక్స్‌లో తొలిసారి టెన్నిస్‌ను ప్రవేశపెట్టాక భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న ఏడో ప్లేయర్ సుమిత్ నగాల్. గతంలో విజయ్ అమృత్‌రాజ్, జీషాన్ అలీ (1988), రమేశ్‌కృష్ణన్ (1992), లియాండర్ పేస్ (1992, 1996, 2000), విష్ణువర్ధన్, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (2012) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment