ప్రపంచ 38వ ర్యాంకర్‌పై విజయం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్‌లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్‌లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
నిర్ణాయక మూడో సెట్‌లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో అర్నాల్డి సర్వీస్‌లను బ్రేక్ చేసి తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు.
రెండో రౌండ్‌లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment