బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ (జనవరి 9) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఫార్చూన్ బారిషల్‌తో జరిగిన సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమయ్యాయి.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు.
𝘼𝙗𝙨𝙤𝙡𝙪𝙩𝙚 𝙘𝙞𝙣𝙚𝙢𝙖! 🍿
Rangpur Riders were all but out of the contest until Skipper Nurul Hasan smashed 30 off the final over to pull off an incredible heist! 😵💫#BPLonFanCode pic.twitter.com/9A7R96fmhU— FanCode (@FanCode) January 9, 2025
మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్‌లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్.. కైల్ మేయర్స్ (29 బంతుల్లో 61 నాటౌట్; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ (40), షాంటో (41) రాణించారు.
ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (23) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మహ్మదుల్లా (2) విఫలమయ్యాడు. రంగ్‌పూర్ బౌలర్లలో కమ్రుల్ ఇస్లాం 2, సైఫుద్దీన్, అకిఫ్ జావెద్ తలో వికెట్ పడగొట్టారు.
198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్ రైడర్స్ చివరి బంతికి విజయం సాధించింది. కెప్టెన్ నురుల్ హసన్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో రంగ్‌పూర్ గెలుపుకు 26 పరుగులు అవసరం కాగా.. నురుల్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 30 పరుగులు పిండుకున్నాడు.
నురుల్ ఊచకోత ధాటికి బౌలర్ కైల్ మేయర్స్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో నురుల్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంగ్‌పూర్ గెలుపుకు తౌఫిక్ ఖాన్ (38), సైఫ్ హస్సన్ (22), ఇఫ్తికార్ అహ్మద్ (48), ఖుష్దిల్ షా (48) పునాది వేశారు. ప్రస్తుత బీపీఎల్ ఎడిషన్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment