T20 WC: ద్రవిడ్‌, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! | Brian Lara Advice For Suryakumar Which Dravid Rohit May Not Like | Sakshi
Sakshi News home page

T20 WC: ద్రవిడ్‌, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!

Published Wed, May 8 2024 3:08 PM | Last Updated on Wed, May 8 2024 4:03 PM

Brian Lara Advice For Suryakumar Which Dravid Rohit May Not Like

టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్‌ వన్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయాలని సూచించాడు.

తన సూచన టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా జూన్‌ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తాజా వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

ఒంటిచేత్తో జట్టును గెలిపించి
ఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్‌ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే.

అయితే, టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్‌ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.

మూడో నంబర్‌లోనే ఆడించాలి
ఇక నాలుగో స్థానంలో ఓవరాల్‌గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.

‘‘టీమిండియా మేనేజ్‌మెంట్‌కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలి. వన్‌డౌన్‌లోనే అతడు ఆడాలి.

టాపార్డర్‌లో ఆడటమే సరైంది
టీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

అలాగే స్కై కూడా టాపార్డర్‌లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్‌ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.

10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరం.

కోహ్లి త్యాగం చేయాలి
కాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే బెటర్‌. సూర్య స్టార్‌ టీ20 ప్లేయర్‌ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్‌ లారా చెప్పుకొచ్చాడు. 

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్‌ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్‌ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: SRH vs LSG: ఉప్పల్‌ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్‌! ప్రత్యేకంగా మీకోసమే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement