లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని బ్రిటీష్ మీడియా సహా ఆ దేశ అభిమానులు, మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని పక్కకు పెట్టి, బుమ్రాపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లండ్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని బీబీసీ ఏకి పారేసింది. ఈ ఘోర పరాభవానికి రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని, అసలు టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించడమే తప్పుడు నిర్ణయమని ధ్వజమెత్తింది.
షమీ, బుమ్రాల విషయంలో ఇంగ్లీష్ బౌలర్ల అంచనా తప్పిందని, వికెట్లు తీయడానికి బదులు ఆటగాళ్లపై భౌతిక దాడికి ప్రయత్నించమే ఇంగ్లీష్ జట్టు కొంపముంచిందని బీబీసీ పేర్కొంది. ఓ పక్క స్కోరు పెరుగుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్ల తీరు మారలేదని, తీరా పరిస్థితి చేతులు దాటాక ఏం చేయలేక చేతులెత్తేశారని మండిపడింది. 1980లో వెస్టిండీస్, 1990-2000లో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉన్నాయో.. ఇప్పుడు భారత్ కూడా అంతే బలంగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ వార్తా సంస్థ టీమిండియాను ఆకాశానికెత్తింది.
మరోవైపు, లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఘోర వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆటగాళ్ల కుతంత్రాలే ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బ తీసాయని మండిపడ్డాడు. వికెట్ల మీదికి కాకుండా.. షమీ, బుమ్రాల వైపు బంతులేయడమేంటని ఆయన ఇంగ్లండ్ బౌలర్లను నిలదీశాడు. బుమ్రాని టార్గెట్ చేసి.. షమీని ఔట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని చురకలంటించాడు. కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా-షమీ జోడీ 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో టీమిండియా పేసర్ల ధాటికి రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 151 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
చదవండి: అక్కడ కూడా నవ్వలేదు.. ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌పై ప్రధాని మోదీ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment