టోక్యో: బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్ ఒకటి కాదు... రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు. స్వదేశంలోనే అతనిపై ఏమాత్రం అంచనాలు లేవు. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్ డియాన్ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు.
గత సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్ బారిన పడ్డాడు. ఈసారి కరోనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల దగ్గు ఓ పట్టాన తగ్గనేలేదు. అందుకే అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం అతనే విజేత! పోటీని టామ్ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్‌కన్ స్కాట్ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్ స్విమ్మర్ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్ స్విమ్మర్లు ఒకే ఈవెంట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment