‘మూడో’ కన్ను చెదిరింది! | Bronze lost to Manu Bhakar | Sakshi
Sakshi News home page

‘మూడో’ కన్ను చెదిరింది!

Published Sun, Aug 4 2024 4:24 AM | Last Updated on Sun, Aug 4 2024 4:24 AM

Bronze lost to Manu Bhakar

మనూ భాకర్‌కు త్రుటిలో చేజారిన కాంస్యం

25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానం

2 కాంస్యాలతో ముగించిన భారత యువ షూటర్‌ 

ఏడు రోజుల వ్యవధి. రెండు ఒలింపిక్‌ కాంస్య పతకాలు  గెలిచిన ఘనత. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర  సృష్టించేందుకు సై. కానీ చివరకు ‘షూట్‌ ఆఫ్‌’తో ఆశలకు  తెర పడింది. త్రుటిలో కాంస్యం చేజారింది. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున వ్యక్తిగత క్రీడాంశంలో మూడు పతకాలు  గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా నిలవాలని ఆశించిన యువ షూటర్‌ మనూ భాకర్‌కు చివర్లో చుక్కెదురైంది. 

తీవ్ర ఒత్తిడికి తలవంచిన ఆమె ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక నాలుగో స్థానంతో  ముగించింది. అయితే 22 ఏళ్ల మనూ భాకర్‌ సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. మూడు ఈవెంట్లలో రెండు పతకాలు, మరో దాంట్లో నాలుగో స్థానం అంటే అసాధారణ ప్రదర్శన. గత టోక్యో ఒలింపిక్స్‌లో కనీస ప్రభావం చూపించలేక తీవ్ర విమర్శలపాలైన ఈ యంగ్‌స్టర్‌ ఇప్పుడు పారిస్‌ నుంచి సగర్వంగా స్వదేశం వెళుతోంది.   

పారిస్‌: భారత స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని సాధించడంలో విఫలమైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో మనూ నాలుగో స్థానానికి పరిమితమైంది. శనివారం జరిగిన ఫైనల్లో మనూ ‘షూట్‌–ఆఫ్‌’లో ఓటమి పాలైంది. ఒక్కో సిరీస్‌లో ఐదు షాట్‌ల చొప్పున ఉండే ఎనిమిది సిరీస్‌లు ముగిసేసరికి మనూ 28 పాయింట్లు స్కోరు చేసింది. హంగేరీకి చెందిన వెరోనికా మాయో కూడా సరిగ్గా 28 పాయింట్లే సాధించింది. దాంతో ఇద్దరి మధ్య ఐదు షాట్‌ల ‘షూట్‌–ఆఫ్‌’ నిర్వహించారు. 

ఇందులో మూడు షాట్‌లను మనూ లక్ష్యంపైకి సరిగ్గా కొట్టగా... నాలుగు షాట్‌లు సరిగ్గా కొట్టిన వెరోనికాయే పైచేయి సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దాంతో మనూకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో తొలి సిరీస్‌లో రెండు షాట్‌లు మాత్రం లక్ష్యం చేర్చిన మనూ పేలవంగా మొదలు పెట్టింది. అయితే ఆ తర్వాత వరుసగా 4, 4 పాయింట్లు సాధించి 10 పాయింట్లతో ఎలిమినేషన్‌ రౌండ్‌కు సిద్ధమైంది. ఇక్కడ మళ్లీ తడబడి 3తో మొదలు పెట్టిన మనూ ఆ తర్వాత వరుసగా 5, 4, 4 పాయింట్లతో ఏడు సిరీస్‌ల తర్వాత మొత్తం 26 పాయింట్లతో రెండో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచింది. 

అయితే ఈ తర్వాత ఈ జోరు కొనసాగలేదు. ఎనిమిదో సిరీస్‌ మనూను బాగా దెబ్బ తీసింది. కేవలం 2 షాట్‌లు మాత్రమే లక్ష్యం చేరడంతో వెనకబడిపోయి కాంస్యం కోసం పోటీ పడాల్సి వచ్చింది. అయితే ‘షూట్‌–ఆఫ్‌’లో అదే వైఫల్యం కొనసాగింది. ఈ ఈవెంట్‌లో ‘షూట్‌–ఆఫ్‌’లో జిన్‌ యాంగ్‌ (దక్షిణ కొరియా) స్వర్ణం, క్యామిలె జెడ్‌రెస్కీ (ఫ్రాన్స్‌) రజతం గెలుచుకున్నారు. నిర్ణీత 10 సిరీస్‌ల తర్వాత ఇద్దరూ 37 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్‌–ఆఫ్‌’లో జిన్‌ యాంగ్‌ 3 పాయింట్లు సాధించగా... క్యామిలె ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది.  

స్కీట్‌లో నిరాశ... 
షూటింగ్‌లోనే స్కీట్‌ ఈవెంట్‌ పురుషుల విభాగంలో భారత షూటర్‌ అనంత్‌ జీత్‌సింగ్‌ నరూకా విఫలమయ్యాడు.  ఐదు క్వాలిఫయింగ్‌ రౌండ్ల తర్వాత అతను 24వ స్థానంలో మాత్రమే నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. తొలి ఆరుగురు ఫైనల్‌కు చేరే ఈ ఈవెంట్‌లో అనంత్‌ జీత్‌ మొత్తం 125కుగాను 116 (23, 22, 23, 24, 24) పాయింట్లు సాధించాడు. 

బాక్సర్‌ నిశాంత్‌ ఓటమి 
బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన 71 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో నిశాంత్‌ దేవ్‌ 1–4తో మార్కో వెర్దె (మెక్సికో) చేతిలో ఓడిపోయాడు. నిశాంత్‌ ఓటమితో పురుషుల విభాగంలో భారత కథ ముగిసింది. 

ఒత్తిడిని అధిగమించలేకపోయాను 
పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడో పతకంపై గురి పెట్టాను. అయితే కీలక సమయంలో ఒత్తిడిలో చిత్తయ్యాను. ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అయితే రెండు కాంస్యాల తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా  ఉన్నాను. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఇంతకంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాను.  ‘షూట్‌–ఆఫ్‌’లో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా. దానిని అధిగమించి గెలిచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించినా అది సరిపోలేదు. రెండు పతకాలు గెలవడం సంతోషకరమే.

కానీ ఈ క్షణాన మాత్రం నాలుగో స్థానం నాకు తీవ్ర నిరాశ కలిగించింది. ఒలింపిక్స్‌లో చాలా వరకు బాగానే ఆడినా ఈసారి విఫలమయ్యాను. ఎప్పుడైనా రేపు మరో అవకాశం అనేది ఉంటుంది. 2028 కోసం ఎదురు చూస్తున్నా. ఈ పోరుకు ముందు ఎలాగైనా మూడో పతకం సాధించాలని నాపై ఎవరూ ఒత్తిడి పెట్టలేదు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నాను కాబట్టి బయటి వ్యక్తుల అంచనాల గురించి కూడా నాకేమీ తెలియదు. 

నాలుగో స్థానం దక్కింది కాబట్టి నా లోపాలేమిటో తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. పతకం రాకపోతే ఎవరూ నిరాశ చెందవద్దని నేను ముందే చెప్పడం ఏదో మాట వరసకు అన్నదే. ఇక్కడా గెలిస్తే బాగుండేది. కానీ చివరి వరకు పోరాడగలిగాను. నేను ఈ ఒలింపిక్స్‌ కోసం చాలా కష్టపడ్డాను. ఇక ముందు ఇలాగే కష్టపడతానని అందరికీ చెబుతున్నాను.  –మనూ భాకర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement