Bumrah: కెనడాకు వెళ్లి.. అక్కడి క్రికెట్‌ జట్టుకు ఆడాలనుకున్నా.. | Bumrah Wanted To Immigrate To Canada Tells Wife Wouldve Tried For Their National Team | Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: కెనడా క్రికెట్‌ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి

Published Thu, Apr 11 2024 4:05 PM | Last Updated on Thu, Apr 11 2024 5:05 PM

Bumrah Wanted To Immigrate To Canada Tells Wife Wouldve Tried For Their National Team - Sakshi

ప్రపంచంలో ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఫాస్ట్‌ బౌలర్లలో టీమిండియా క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్లకు అతీతంగా ఈ పేస్‌ గుర్రం సత్తా చాటుతున్నాడు. టెస్టుల్లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు ఈ పేస్‌ దళ నాయకుడు.

నిజానికి టీమిండియా తమ పేస్‌ బెంచ్‌ను పటిష్టం చేసుకునే సమయంలోనే బుమ్రా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టి నంబర్‌ వన్‌గా ఎదిగాడు.

వరల్డ్‌క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా నీరాజనాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్‌డమ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు బుమ్రా. అయితే.. ఒకానొక సమయంలో బుమ్రా కెనడాకు వలస వెళ్లి అక్కడి క్రికెట్‌ టీమ్‌లో ఆడాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.

అవును.. కెనడాకు వలస వెళ్లాలి అనుకున్నా
జియో సినిమా షోలో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, తన సతీమణి సంజనా గణేషన్‌.. నువ్వు కెనడాకు వెళ్లి.. అక్కడే జీవించాలనుకున్నావా అని అడిగిన ప్రశ్నలకు బుమ్రా ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘‘అవును.. అలాంటి సంభాషణలు జరిగేవి.

నాకు తెలిసి ప్రతి ఒక అబ్బాయికి క్రికెట‌ర్‌ అవ్వాలన్న కోరిక ఉంటుంది. ఇండియాలో వీధి వీధికి సుమారుగా 25 మంది టీమిండియాకు ఆడాలనే కుర్రాళ్లు ఉంటారు. అదే సమయంలో మనకు బ్యాకప్‌ ప్లాన్‌ కూడా ఉండాలి కదా!

మా బంధువుల్లో కొందరు కెనడాలో ఉన్నారు. నా విద్యాభ్యాసం పూర్తైన తర్వాత.. కుటుంబమంతా అక్కడికి వెళ్లిపోదాం అనుకున్నాం. అయితే, అక్కడి భిన్న సంస్కృతికి మేము అలవాటు పడలేమని భావించి.. మా అమ్మ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

అమ్మ వల్లే ఆట, అదృష్టం
అమ్మ అలా చేయడం నాకు సంతోషాన్ని, అదృష్టాన్నీ ఇచ్చింది. ఇక్కడే నేను అనుకున్నవన్నీ వర్కౌట్‌ అయ్యాయి. లేదంటే బహుశా నేను కెనడా వెళ్లి అక్కడి క్రికెట్‌ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడినేమో.

ఇప్పుడు నేను టీమిండియాకు, ముంబై ఇండియన్స్‌కు ఆడుతుండటం సంతోషంగా ఉంది’’ అని జస్‌ప్రీత్‌ బుమ్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్న బుమ్రా.. ముంబై ఇండియన్స్‌ తరఫున ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు.

ఇక 2016లో టీమిండియాలో అడుగుపెట్టిన ఈ గుజరాతీ బౌలర్‌ 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 159, 149, 74 వికెట్లు తీశాడు. కాగా స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనాను పెళ్లాడాడు బుమ్రా. ఇటీవలే వీరికి కుమారుడు అంగద్‌ జన్మించాడు.

చదవండి: Hardik Pandya: రోహిత్‌కు వయసైపోతోంది.. టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్లు వాళ్లిద్దరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement