ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 18వ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్ గ్రీన్ పై చాలా ఆశలే పెట్టుకుంది.
గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్ గ్రీన్ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్ అంతగా ఆకట్టుకోలేదు.
మరో పది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్‌కు ఒక రకంగా బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున కామెరున్ గ్రీన్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీ మార్క్ సాధించాడు.
ఈ సందర్భంగా ఆసీస్ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్‌ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్ లభించింది. కచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్‌లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు.
ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్ ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ బ్యూకాసన్.. గ్రీన్ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.


