టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. అమెరికా వేదికగా గ్రూప్ దశలో మూడింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. సూపర్-8కు అర్హత సాధించింది.
ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. బుధవారం నాటి పోరులో అమెరికాను ఓడించి తమ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక ఈ మూడు విజయాలలో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.
పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాను కాదని.. తనతో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలుత ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రాణించిన రెండు వికెట్లతో రాణించిన అర్ష్‌దీప్ (2/35).. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు.
నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, తాజాగా అమెరికాతో మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అర్ష్‌దీప్. నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.
తద్వారా అమెరికాను 110 పరుగులకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇక గ్రూప్ దశ తర్వాత సూపర్-8 కోసం భారత జట్టు వెస్టిండీస్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే విండీస్ పిచ్‌లపై మ్యాచ్‌ల కోసం టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడని అభిప్రాయపడ్డాడు. తన బౌలింగ్‌లోని వైవిధ్యం కారణంగా మహ్మద్ సిరాజ్ కంటే అర్ష్‌దీప్ ఓ అడుగు ముందే ఉంటాడని కుంబ్లే పేర్కొన్నాడు.
‘‘టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో తన సత్తా చూపించాడు. ఒకవేళ వెస్టిండీస్‌లో టీమిండియా కేవలం ఇద్దరు సీమర్లతో పాటు హార్దిక్ పాండ్యా(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)ను మాత్రమే తీసుకుంటే గనుక సిరాజ్ కంటే అర్ష్‌దీప్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతుంది.
ఈ లెఫ్టార్మ్ పేసర్ జట్టులో ఉంటే బౌలింగ్ విభాగంలో వైవిధ్యం ఉంటుంది. జట్టుకు అతడు అదనపు బలంగా మారతాడు’’ అని అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా భారత్ గ్రూప్ దశలో తదుపరి శనివారం కెనడాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment