
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal ) విడాకులకు సిద్ధమయ్యాడా?.. భార్య ధనశ్రీ వర్మతో అతడు విడిపోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చహల్ సోషల్ మీడియా అకౌంటర్లను గమనిస్తే అతడు త్వరలోనే ఈ చేదు వార్తను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
హర్యానాకు చెందిన 34 ఏళ్ల చహల్ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చహల్.. వన్డే, టీ20లలో ప్రధాన స్పిన్ బౌలర్‌గా ఎదిగాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 72 వన్డేలు, 80లు ఆడిన చహల్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు.
ఐపీఎల్ వికెట్ల వీరుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ టీ20 లీగ్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చహల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో అతడు ప్రేమలో పడ్డాడు.
కొరియోగ్రాఫర్‌తో వివాహం
ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించిన చహల్- ధనశ్రీ డిసెంబరు 20, 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, ధనశ్రీ పేరు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కలిసి వినిపించడం.. గ్లామర్‌లోనూ ఆమె హీరోయిన్లకు ధీటుగా ఫొటోలు షేర్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. విడాకులు తీసుకోవడమే తరువాయి అన్నట్లు వార్తలు రాగా.. చహల్- ధనశ్రీ అప్పట్లో సంయుక్తంగా విడాకుల విషయాన్ని ఖండించారు.
అనంతరం ఇద్దరూ కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు, ప్రత్యేకమైన సందర్భాలను కలిసి జరుపుకొన్న వీడియోలు షేర్ చేస్తూ.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే, తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారనే ప్రచారం(Divorce Rumours) ఊపందుకుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో చహల్- ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.
పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసిన చహల్
ఇటీవల తమ వివాహ వార్షికోత్సవం(డిసెంబరు 22)న కూడా ఇద్దరూ ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు.. చహల్ ధనశ్రీతో తన పెళ్లి ఫొటోలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.
మరోవైపు.. ధనశ్రీ ఖాతాలో చహల్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతానికి అలాగే ఉన్నా అవి ప్రమోషన్లలో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం బీటలు వారిందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చహల్ చివరగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ల ఒక్క మ్యాచ్‌లోనూ చహల్ ఆడకపోయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో ఉన్న కారణంగా ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.