ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్‌లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్‌ల్లో 141.41 స్ట్రయిక్ రేట్‌తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది.
అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌రేట్‌తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్‌లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు.
అయితే, ఈ సీజన్‌లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 స్ట్రయిక్‌రేట్‌తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు.
టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్‌తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది.
Comments
Please login to add a commentAdd a comment