
మయాంక్ క్లీన్‌బౌల్డ్, మొయిన్ అలీ
చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ సీఎస్‌కే పైచేయి సాధించింది.
బౌలింగ్‌లో దీపక్ చహర్ మ్యాజిక్ స్పెల్... ఫీల్డింగ్‌లో జడేజా విన్యాసాలు... వెరసి రెండు కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పైచేయి సాధించింది. ఎలాంటి ఉత్కంఠభరిత క్షణాలు లేకుండా ఏకపక్షంగా ముగిసిన ఈ పోరులో నెగ్గి ఐపీఎల్ తాజా సీజన్‌లో ధోని జట్టు బోణీ కొట్టింది.
ముంబై: వారం రోజులుగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో... ఊహించని ట్విస్ట్‌లతో అలరించిన ఐపీఎల్ తాజా సీజన్‌కు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్ రూపంలో స్పీడ్ బ్రేకర్ తారసపడింది. మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచి గెలుపు ఖాతాను తెరిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్)... డు ప్లెసిస్ (33 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
నింపాదిగా...
స్వల్ప ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను సీఎస్‌కే త్వరగానే కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ... డు ప్లెసిస్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు బాది పవర్‌ప్లేలో 32 పరుగులు సాధించారు. డు ప్లెసిస్ సింగిల్స్ తీస్తూ అలీకే స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. దాంతో కాస్త దూకుడు కనబర్చిన అలీ... అర్‌షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, మెరిడిత్ బౌలింగ్‌లలో మూడు ఫోర్లు బాదాడు. దాంతో సీఎస్‌కే ఛేజింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అలీ... అదే ఓవర్లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి షారుఖ్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో 66 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైనా (8), రాయుడు (0) వరుస బం తుల్లో అవుటైనా... క్రీజులోకి వచ్చిన స్యామ్ కరన్ (5 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.
షారుఖ్ ఖాన్ మినహా...
తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడిన షారుఖ్ ఖాన్ మినహా పంజాబ్ కింగ్స్‌లో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), క్రిస్ గేల్ (10), దీపక్ హుడా (10)లతో పాటు ఓపెనర్ మయాంక్ (0), నికోలస్ పూరన్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 48/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న కొత్త కుర్రాడు షారుఖ్ ఖాన్... జే రిచర్డ్‌సన్ (15; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్ అశ్విన్ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అడపాదడపా బౌండరీలు కొట్టిన షారుఖ్ ఖాన్ పంజాబ్ స్కోరు 100 దాటేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (రనౌట్) 5; మయాంక్ అగర్వాల్ (బి) దీపక్ చహర్ 0; గేల్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 10; దీపక్ హుడా (సి) డు ప్లెసిస్ (బి) చహర్ 10; పూరన్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) చహర్ 0; షారుఖ్ ఖాన్ (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 47; జే రిచర్డ్‌సన్ (బి) మొయిన్ అలీ 15; మురుగన్ అశ్విన్ (సి) డు ప్లెసిస్ (బి) బ్రావో 6; షమీ (నాటౌట్) 9; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106.
వికెట్ల పతనం: 1–1, 2–15, 3–19, 4–19, 5–26, 6–57, 7–87, 8–101.
బౌలింగ్: దీపక్ చహర్ 4–1–13–4, స్యామ్ కరన్ 3–0–12–1, శార్దుల్ ఠాకూర్ 4–0–35–0, జడేజా 4–0–19–0, మొయిన్ అలీ 3–0–17–1, బ్రావో 2–0–10–1.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) దీపక్ హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 5; డు ప్లెసిస్ (నాటౌట్) 36; మొయిన్ అలీ (సి) షారుఖ్ ఖాన్ (బి) మురుగన్ అశ్విన్ 46; సురేశ్ రైనా (సి) రాహుల్ (బి) షమీ 8; అంబటి రాయుడు (సి) పూరన్ (బి) షమీ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 107.
వికెట్ల పతనం: 1–24; 2–90, 3–99, 4–99.
బౌలింగ్: షమీ 4–0–21–2, జే రిచర్డ్‌సన్ 3–0–21–0, అర్‡్షదీప్ సింగ్ 2–0–7–1, మెరిడిత్ 3.4–0–21–0, మురుగన్ అశ్విన్ 3–0–32–1.
ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్
వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.