విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ (PC: BCCI)
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు టీమిండియాకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్‌కప్ ఆడతారా? లేదా?
స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు వీరు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న విషయం గురించి క్లారిటీ తీసుకోవాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మెగా టోర్నీకి ముందు జరుగనున్న ఈ సిరీస్‌కు జట్టును ప్రకటించే అంశంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోనూ చర్చలు జరిపేందుకు.. అజిత్ అగార్కర్‌తో పాటు శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా సౌతాఫ్రికాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే.
అఫ్గన్‌తో సిరీస్‌లో కెప్టెన్ ఎవరు?
ఈ నేపథ్యంలో ఈ ఏడాది విరాహిత్ ద్వయం వరల్డ్‌కప్-2024 ఆడతారా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో వీరు ఫామ్‌లోనే ఉన్న కారణంగా 2024 సీజన్ తర్వాత భారత టీ20 జట్టుతో చేరతారా? లేదంటే అంతకంటే ముందే అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే టీ20 సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వరల్డ్‌కప్‌నకు ఆఖరి సన్నాహకంగా భావిస్తున్న అఫ్గన్‌తో సిరీస్ నాటికి వీరిద్దరు గాయాల బారి నుంచి కోలుకోకపోతే జట్టును ముందుకు నడిపించేది ఎవరన్న సందేహాల నడుమ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో తాజాగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సఫారీ పర్యటనలో టీమిండియా
కాగా టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు.. బుధవారం నుంచి మొదలుకానున్న రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు.. ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో 25- 30 మంది క్రికెటర్లను ప్రస్తుతం మానిటర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జూన్ 4 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియా అభిమానులకు శుభవార్త: హార్దిక్ పాండ్యా వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment