బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్‌లో రజతం పతకంతో మెరిసింది.
బర్మింగ్‌హామ్: పంచ్ పంచ్‌కూ పతకం తెచ్చి కామనెŠవ్‌ల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్‌నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది.
ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్‌లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో నిఖత్ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment