బార్బడోస్‌తో భారత్‌ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు! | Commonwealth Games: Barbados Women vs India Women Match Prediction | Sakshi
Sakshi News home page

CWG 2022: బార్బడోస్‌తో భారత్‌ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు!

Published Wed, Aug 3 2022 4:38 PM | Last Updated on Wed, Aug 3 2022 4:59 PM

Commonwealth Games: Barbados Women vs India Women Match Prediction - Sakshi

కామన్‌వెల్త్ గేమ్స్-2022లో బుధవారం బార్బడోస్ మహిళల జట్టుతో కీలక పోరులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్‌ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్‌.. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. గ్రూపు-ఎలో నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

ఇక ఇప్పటి వరకు చెరో విజయం సాధించిన భారత్‌, బార్బడోస్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే బార్బడోస్ కంటే భారత్‌(+1.165)కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బార్బడోస్ ఉండగా.. అఖరి స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్‌ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక సెమీస్‌లో అడుగు పెట్టాలంటే బార్బడోస్‌పై హర్మన్‌ ప్రీత్‌ సేన  ఖచ్చితంగా విజయం సాధించాలి.

ఒక వేళ ఓడితే భారత్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక కీలకపోరులో తలపడనున్న భారత్‌, బార్బడోస్ జట్ల బలా బలాలపై  ఓ లుక్కేద్దాం. భారత జట్టు బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఆనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు అఖరిలో చేతులెత్తేశారు. అనంతరం పాక్‌పై మాత్రం టీమిండియా మహిళలు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టారు.

తొలుత బౌలింగ్‌లో పాక్‌ను కేవలం 99 పరుగులకే కుప్ప​కూల్చిన భారత మహిళలు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశారు. ఓపెనర్‌ స్మృతి మంధాన 63 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్‌కు విజయ తీరాలకు  చేర్చింది. ఇక స్మృతి మంధానతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, షఫాలీ వర్మలు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూలాంశం.

ఇక బౌలింగ్‌ పరంగా భారత్‌ కాస్త తడబడుతోంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పేసర్‌ రేణుక సింగ్‌ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిగితా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే రెండో మ్యాచ్‌లో పాక్‌పై మాత్రం బౌలర్లు విజృంభించారు. ఇక మరోసారి భారత బౌలర్లు చెలరేగితే  బార్బడోస్‌కు మాత్రం ఓటమి తప్పదు.

ఇక బార్బడోస్‌ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో పాక్‌పై అద్భుతమైన విజయం సాధించిన బార్బడోస్‌, రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో భంగపాటు పడింది. అయితే బార్బడోస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. జట్టులో కెప్టెన్‌ హేలీ మాథ్యూస్, ఓపెనర్‌ డాటిన్‌ వంటి అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్ వంటి సీనియర్‌ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
తుది జట్లు (అంచనా)
బార్బడోస్ మహిళల జట్టు: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్‌), కైసియా నైట్ (వికెట్‌ కీపర్‌), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్‌బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, కైలా ఇలియట్, షానికా బ్రూస్

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్
చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్‌! తల్లితో దిగిన ఫొటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement