సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రాజధాని నగరం అడిలైడ్‌లోని ఓ క్వారంటైన్ హోటల్‌లో పనిచేసే వర్కర్ ద్వారా స్థానికంగా నివాసం ఉండే కుటుంబానికి కోవిడ్-19 సోకిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. స్కూళ్లు, షాపులు మూసివేస్తూ అలర్ట్ విధించింది. ఈ విషయం గురించి ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా క్లస్టర్‌లో నమోదవుతున్న కేసులు తమకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని, అయితే విపత్కర పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే విషయంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
కాగా అడిలైడ్‌లో కరోనా వ్యాప్తి టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. నగరంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తాము ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రకటించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో రేపు ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ ప్రకటించాడు. ఇలాంటి తరుణంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాల మధ్య టెస్టు నిర్వహణ సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆసీస్ బోర్డు మాత్రం అడిలైడ్ టెస్టు యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. జాగ్రత్తలు పాటిస్తూ మ్యాచ్‌ను నిర్వహిస్తామని పేర్కొంది. కాగా 3 వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైన సంగతి తెలిసిందే. (చదవండి: భారత్‌తో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం)
ఈ క్రమంలో వచ్చే నెల 17 నుంచి అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలిసారిగా డే-నైట్ టెస్టు జరుగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 27,000 మంది ప్రేక్షకులకు అంటే స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇక 69 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం ఇప్పటికే ఆసీస్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీసు మొదలెట్టింది. ఇదిలా ఉండగా.. కరోనా లోకల్ ట్రాన్స్‌మిషన్ లేనందున సిరీస్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment