ముచ్చటగా 3 మ్యాచ్‌లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు | CPL 2023: Ambati Rayudu, Blessing Muzarabani Leave The Tournament Due To Personal Reasons | Sakshi
Sakshi News home page

ముచ్చటగా 3 మ్యాచ్‌లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు

Published Thu, Aug 31 2023 4:04 PM | Last Updated on Thu, Aug 31 2023 6:28 PM

CPL 2023: Ambati Rayudu, Blessing Muzarabani Leave The Tournament Due To Personal Reasons - Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్‌ మధ్యలోనే స్వదేశాని​కి వచ్చేశాడు. ప్రవీణ్‌ తాంబే తర్వాత కరీబియన్‌ లీగ్‌ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్‌లు ఆడాడు.

ఇందులో ఓ మ్యాచ్‌లో (తొలి మ్యాచ్‌) డకౌట్‌ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్‌ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్‌రేట్‌తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్‌ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు, భారత దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్‌ 2023 ఎడిషన్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే.

మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్‌ బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ కూడా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్‌ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒకే వికెట్‌ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు.

రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ వీరికి  రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు విల్‌ స్మీడ్‌, బెన్నీ హోవెల్‌లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్‌ విధ్వంసకర బ్యాటర్‌ కాగా.. హోవెల్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. 

ఇదిలా ప్రస్తుత సీపీఎల్‌ ఎడిషన్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఎవిన్‌ లెవిస్‌ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement